Episode - 2:
చూసిన వెంటనే ప్రేమ పుడుతుందో లేదో తెలీదు కానీ, ఆకర్షణ మాత్రం పుడుతుంది. అందులోనూ మన ఊహాల్ని పోగేసి ఒక బొమ్మ గీసి రంగులు అద్ది ప్రాణం పోస్తే ఎలాంటి రూపం మన కన్నుల ముంగిట నిలుస్తుందో, అచ్చం అలాగే ఒకరు మన ముందుకి వస్తే ఖచ్చితంగా ఆకర్షణ పుడుతుంది. అది మానవ నైజం. కానీ నా విషయంలో చూసిన వెంటనే ఆకర్షణ పుట్టలేదు. నేను బాధలో ఉన్నప్పుడు అతని చిరునవ్వు చూసి ముగ్ధురాలిని అయ్యాను. ఆ నవ్వు చూస్తే, నా frustration కాస్తా relief గా మారింది. ఇది అభిమానమా?? లేక ఆకర్షణ?? ఏదో తెలీదు గానీ ఆ స్వచ్ఛమైన నవ్వు వెనక దాగిన చిరునామా ఎలా అయినా తెలుసుకోవాలని నేను ఒక చిన్నపాటి అన్వేషణ మొదలు పెట్టాను.
ఈ అన్వేషణ లో భాగంగా, ముందుగా నేను నాతో close గా ఉండే colleague తో విషయం చెప్పా. మన opposite ప్రాజెక్ట్ లో ఉన్న అబ్బాయి మీద నాకు క్రష్ అని. ఇక ఇలాంటి విషయాలు కాంతి కంటే వేగంగా, ఒకరి నుంచి ఇంకొకరికి, ఆ ఇంకొకరి నుంచి మరొకరికి.. ఆ మరొకరి నుంచి వేరొకరికి తెలిసిపోతాయి. ఇలా స్టాలిన్ సినిమా లో లాగా ఈ వార్త దాదాపు మా ప్రాజెక్ట్ లో ఉన్న అందరికి తెలిసిపోయింది. అంత ఈజీ గా ఎలా తెలిసింది అనే దాని గురించి పెద్దగా ఆలోచించకర్లేదు, ఆఫీస్ లో సగం time ఇలాంటి సొల్లుకే సరిపోతుంది కాబట్టి.
ఏదైతేనేం, అందరికి తెలిసింది. ఇలా తెలియడం వల్ల లాభాలు ఉన్నాయి అనుకున్నా కానీ వాటితో వచ్చే నష్టాలు మాత్రం అప్పుడు గ్రహించలేకపోయాను. సరే జరిగేది జరగనీ, at least తన పేరు కనుక్కోవాలి అని అందరికీ చెప్పేసాను.
అలా చెప్పానో లేదో, ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇవ్వడం మొదలు పెట్టారు. అలా వచ్చిన ఐడియాల్లో ఒక మంచి ఐడియా ఏంటంటే, సాయంత్రం క్యాబ్ ఏరియాకి వెళ్లి తను ఏ క్యాబ్ ఎక్కితే ఆ క్యాబ్ నంబరు చూసి, క్యాబ్ ఏరియా లో ఉన్న క్యాబ్ లిస్టులో తన పేరు చూసి, మన ఆఫీస్ పోర్టల్ లో అతని పేరు search చేస్తే details మొత్తం తెలుసుకోవచ్చు అని.
ఐడియా ఏదో బాగానే ఉందని అనుకున్నా. ఆరోజు సాయంత్రం క్యాబ్ దగ్గర, నేను నా ఫ్రెండ్ wait చేస్తూ ఉండగా, ఆ అబ్బాయి కూడా రానే వచ్చాడు. అవకాశం దొరికింది కదా అని అతన్ని చూస్తూ ఉన్నాం. ఈసారి ఆ అబ్బాయి మమ్మల్ని చూసాడు. అతను నన్ను గమనించడం ఇదే మొదటిసారి. ఒక్క క్షణం భయం వేసింది, గుండె వేగం పెరిగింది. నాకు తానెంతో స్పెషల్ కావచ్చు, కానీ అతనికి నేనొక regular అమ్మాయిని. అది గ్రహించిన తర్వాత, నేను కాస్త ఊపిరి పీల్చుకున్నా. కానీ తన పేరు తెలుసుకొనే ప్రయత్నం మాత్రం ఆపలేదు.
ఈ తొక్కలో క్యాబ్ కూడా ఎంతసేపటికీ రాదే. దరిద్రం నాతో salsa చేస్తుంది అనుకుంటా, నా క్యాబ్ వచ్చేసింది. అదేంటో ప్రతి రోజు అతని క్యాబ్ వచ్చి వెళ్తుంది. అతను వెళ్లే వరకు అతన్నే చూస్తూ గడిపేదాన్ని, ఈరోజు మంచి ఐడియా తో వస్తే, ఖర్మ కాలి నా క్యాబ్ ముందు వచ్చింది. ఇది ఎలా ఉందంటే: గొడుగు తెస్తే వాన పడదు, గొడుగు లేని రోజు వాన ఆగదు అన్నట్టు. మన టైం బాగలేక పోతే మనం ఎన్ని ఐడియాలు వేసినా ఇలా నీరు కారిపోవాల్సిందే. అయనా నిరాశ పడకుండా, మరుసటి రోజు పేరు కనుక్కోవచ్చు అనే రెట్టింపు నమ్మకంతో ఇంటికి క్యాబ్ లో బయలుదేరాను. జీవితం మొత్తం నమ్మకం తో బ్రతకాల్సిందే. రేపు అనే ఉదయం కోసం నేడు అస్తమించాల్సిందే. మరి నేను ఇంటికి వెళ్తున్నా. రేపు ఆఫీస్ టైం లో మాట్లాడుకుందాం.
(తరువాయి భాగం రేపు)
Comments