<Episode 1> <Episode 2> <Episode 3> <Episode 4> <Episode 5> <Episode 6> <Episode 7>
Episode 3:
మొన్నటి దాకా ఎవరో కూడా తెలియని వాళ్ళని నిన్న చూసి ఈరోజు ఫోన్ నెంబర్ అడిగేసి చాటింగ్ లు డేటింగ్ లు ఫైటింగ్ లు కూడా చేసేస్తున్న ఈ కాలం లో నేనేమో అతన్ని చూసి ఆకర్షణ కి లోనయ్యి, అది అభిమానమే అనే నిర్ధారణ కి వచ్చి, ఎలాగైనా పేరు తెలుసుకోవాలని అనుకున్నప్పటికి 4 వారాలు గడిచిపోయాయి. పేరు తెలీనప్పుడు ప్రతి రోజు అతను క్యాబ్ ఎక్కే వరకు అక్కడే ఉండేదానిని. ఇప్పుడు తెలుసుకుందాం అనుకుంటే కాలం కలిసి రావట్లేదు. అనుకుంటాం గాని దేనికైనా టైం రావాలి అనేది అందుకే. టైం బాగలేకపోతే అరటి పండు తిన్నా పళ్ళు విరుగుతాయి.
నాకు ఈ క్యాబ్ ఐడియా ఇచ్చిన ఫ్రెండ్, నన్ను చూసి కాంచన మూవీ లో లారెన్స్ లాగా: తెలిసిపోయిందా!! అని అడిగాడు. ఏంటి తెలిసేది నా బొంద, తన క్యాబ్ రాలేదు అని చెప్పా. అధైర్యపడకు అని నన్ను మళ్ళీ ప్రోత్సహించాడు. తర్వాత మేము కాఫీ తాగడానికి వెళ్ళినపుడు, ఏక్కడినుంచో ఊడి పడ్డట్టు, ఆ అబ్బాయి కూడా అదే కెఫిటీరియాలో ప్రత్యక్షమయ్యాడు. ఇక నా గుండె జారి గల్లంతయ్యింది. ఏంటి చూసిన ప్రతిసారి ఇలానే అవ్వుద్దా అని మీకు సందేహం రావచ్చు, కానీ ఈ చిన్ని గుండె కి feelings ఎక్కువ logics తక్కువ. అయినా మీకు కూడా మీ జీవితంలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగితే, అప్పుడు realise అవుతారు. నెను చెప్పేది నూటికి నూరు పాళ్లు కరెక్టే అని. ఇక మీకు తెలీనిది ఏముంది, ఒకరి crush ఎదురు పడితే, వాళ్ళకి ఎలా ఉన్నా, పక్కనున్న ఫ్రెండ్స్ కి మాత్రం భలే సరదా. ఆట పట్టించడానికి అదే కరెక్ట్ టైం. అలానే నా ఫ్రెండ్స్ కూడా ఆ అబ్బాయి ని చూసి: is that the guy.. yes(ఇంగ్లీష్).. అతనేనా(తెలుగు).. వహి హై క్యా (హిందీ)..అవన్ అలగరిక(తమిళ)..కేయ్ కూఞ్చవే (కిలికి, ఈ భాష కూడా వదల్లేదు :p) ఇలా అన్ని భాషల్లో ఒకటే గుసగుసలు. అప్పుడే తెలిసింది గుసగుసలకి బాషతో పని లేదు అని. ఏదో బాహుబలి సినిమా ని అన్ని భాషల వారు ఆదరించినట్టు.
ఇంకో ఫ్రెండ్ తన వంతు ప్రయత్నం చేసింది, ID కార్డ్ అయినా చూసి పేరు తెలుసుకుందామని. అది పొట్టిది. మా వాడి height కి తేలిపోయింది. సరే ఇక ఇందులో కొత్తేముంది అని అనుకున్నా.మళ్ళీ సాయంత్రం అయింది, ఎప్పటి లాగే రొటీన్ గా క్యాబ్ కోసం చూస్తున్నా. అతడి కోసం కూడా. కానీ ఇప్పుడు రొటీన్ కి భిన్నంగా, ఆ అబ్బాయి కనపడలేదు. ఎంతసేపు చూసినా రాలేదు. ఇక మెదడు వేగంగా ఆలోచించడం మొదలు పెట్టింది. కెఫిటీరియా లో కనిపించాడు. పోనీ మధ్యలో వెళ్ళిపోయాడా?? ఎందుకు రాలేదు?? ఏం జరగలేదు కదా అనే భయం కూడా మొదలైంది. ఇలా రకరకాల ఎమోషన్స్ ఒక్కసారిగా మదిలో మెదిలాయి. చివరిదాకా చూసాను. ఆఖరికి నిరాశే మిగిలింది.
మరుసటి రోజు ఆఫీస్ కి రాగానేే మంజు అనే ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి, నిన్న మీ హీరో క్యాబ్ లో వెళ్ళలేదు కదా అని అనింది. అవును నీకెలా తెలుసు అని ఆతృతగా అడిగా. అప్పుడు చెప్పింది, అతను బైక్ లో వెళ్ళిపోయాడు అని. కొత్త బైక్ అని, Royal Enfield అని కూడా చెప్పింది. అది విన్నాక నా పరిస్థితే అస్సలు బాగాలేదు. కానీ ఏమీ చేయలేము. ఆ క్యాబ్ ఐడియా ఇక గోవిందా గోవింద. ఇక ఇతర ప్లాన్ ఏదైనా వేసి పేరు తెలుసుకోవాలి అని దృఢ సంకల్పంతో ఉన్నా.
ఒక కన్ను నా సిస్టం మీద, ఇంకో కన్ను opposite wing మీద పెట్టి ఎదో వర్క్ చేస్కుంటూ ఉన్న. మంజు వచ్చి, "నేను వాటర్ తాగడానికి pantry కి వెళ్లినపుడు అదే టైం లో అక్కడ మీ హీరో కూడా ఉన్నాడు. నేను తనని చూస్తుండగా, అతను కూడా నన్ను చూసాడే. నన్ను చూసి ఒక నవ్వు కూడా నవ్వాడే" అని అంది. ఇంతలో ఈ మాటలు విన్న మిగతా ఫ్రెండ్స్, పగలపడి నవ్వుతూ "Line వేస్తుంది నువ్వైతే, అతను connect అయింది మంజు కి " అని అనేశారు. ఇక అంత జరిగాక, నేను ఎలా ఊరుకునేది, మనసులో బాధ తన్నుకొచ్చేసింది. మరి నేను ఇంత బాధ లో మీకు నా కథ ఎలా చెప్పేది. కాస్త కూల్ అయ్యాక మాట్లాడుకుందాం. (తరువాయి భాగం రేపు @ 6PM)
Comments