T.H.E | Episode 2 | A Thriller from SamosaTimes

 T.H.E | Ep:2

--- మంగళవారం 12/Sep/2017 ---
మంగళవారం సాయంత్రం ఆరు. అమ్మ నుంచి ఆరు మిస్సిడ్ కాల్స్. మీటింగ్ లో ఉండడం వల్ల చూసుకో లేదు. అమ్మ రోజూ ఆరుకి కాల్ చేసేది. మరిప్పుడేంటి, ముందే ఇన్ని మిస్సిడ్ కాల్స్. ఏమైయుంటుంది?. అమ్మ ఒక ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్. తన వర్క్ రోజూ ఐదుకే అయిపోయినా.. నా కోసం ఇంకో గంట స్కూల్ లొనే గడిపి ఆరుకి ఫోన్ చేస్తుంది. నా ఆఫీస్ సాయంత్రం ఆరుకి ఐపోతుంది. నేను వెళ్లి అమ్మని పికప్ చేస్కొని ఇంటికి వెళ్తా. ఎందుకు అన్ని సార్లు కాల్ చేసిందో అని తిరిగి అమ్మ కి కాల్ చేసాను. "ఏంటి నాన్నా ఇంకా ఆఫీస్ ఐపోలేదా. నాకు ఈరోజు పెద్దగా పనేం లేదు. నీకు కుదిరితే త్వరగా ఇంటికి వెళ్దాం అని కాల్ చేసాను" చెప్పింది అమ్మ. "సారీ మా. మీటింగ్ ఇప్పుడే ఐపోయింది. అయిదు నిమిషాల్లో స్కూల్ దగ్గర ఉంటా" అని చెప్పి బయల్దేరాను. 
ఆఫీసు లో బిజీ గా ఉండడం వల్ల గుర్తురాలేదుగాని, కారు లో వెళ్తుంటే మళ్ళీ గుర్తొచ్చింది. నిజంగా అతను చెప్పింది జరుగుతుందంటావా. ఖచ్చితంగా జరగదు. నేనేదో నాకు అమ్మ మీద ఉన్న ప్రేమ, అమ్మకు అలాంటిది జరగకూడదు అన్న భయం కొద్దీ ఇలా ఆలోచిస్తున్నానే కానీ. అస్సలు జరగబోయేది అతనెలా చెప్పగలడు. కానీ అతని గొంతు నమ్మశక్యం గానే ఉంది. వినడానికి బెదిరింపు లాగా కూడా లేదే. "నీ మంచి కోసమే చెప్తున్నా నమ్ము" అంటాడు. ఇలా సాగుతున్న నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ స్కూల్ వచ్చేసింది. అమ్మ నవ్వుతూ ముందు సీట్లో కూర్చుంది. " మధ్యాహ్న్నాం తిన్నావా సరిగ్గా.. లేక మళ్ళీ లంచ్ బాక్స్ అలానే ఇంటికి తెస్తున్నావా?" అని అడిగింది అమ్మ. "లేదమ్మా.. లంచ్ బాక్స్ ఖాళీ చేసేసా" చెప్పి కార్ స్టార్ట్ చేశా. ఏంటో రోడ్డు మొత్తం ఖాళీ గా ఉంది. స్కూల్ నుంచి ఒక కిలోమీటరు ముందుకు వెళ్తే మెయిన్ రోడ్డు. స్కూల్ రోడ్డు , మెయిన్ రోడ్డు కలిసే చోటు T జంక్షన్ లా ఉంటుంది. సరైన ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా లేవు. అదే అతను చెప్పిన ప్రదేశం. దగ్గరపడే కొద్దీ మనసు లో ఎదో వణుకు. " ఎందుకు రా టెన్షన్ పడ్తున్నావ్" అడిగింది అమ్మ, నుదుటన పడుతున్న చెమట తుడుచోకోవడానికి తన కర్చీఫ్ ఇస్తూ. "ఏం లేదమ్మ, ముందు నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో" అని చెప్పా. టైం చుస్తే 6.25. ఎదురుగా T జంక్షన్. ఆపాలా వద్దా... నాకు తెలియకుండానే ఎందుకో బ్రేక్ వేసేశా . అమ్మ విషయం లో నేనేమాత్రం రిస్కు తీస్కొదల్చుకోలేదు. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. బయట ఎక్కడా మనుషులు గానీ, వాహనాలు గాని కనిపించట్లేదు. వాడు నన్ను సరదా పట్టిస్తున్నాడా. నాకున్న ప్రేమని ఆసరాగా చేస్కొని ఆటపట్టిస్తున్నాడా. వాడికిదే సరదాలా ఉంది. మరి తను చెప్పినట్టు ఇక్కడ ఏం జరగలేదే. 
"ఎందుకు రా కారు ఆపేసావ్" అడిగింది అమ్మ. "ఏం లేదు మా. నీళ్లు తాగలనిపించి" అని కొన్ని నీళ్లు తాగి కార్ స్టార్ట్ చేశా. ఖచ్చితంగా అదొక ప్రాంక్ కాల్ అయ్యుంటుంది. నేనొక వెధవలా నమ్మేసాను. మెల్లగా ముందుకు కదిలాను. మూడో గేర్ వేసి వేగం పెంచేలోపే, రోడ్డు మధ్యలో ఎవరూ... సడన్ బ్రేక్.... . అమ్మ సీట్ బెల్ట్ పెట్టుకుంది కాబట్టి సరిపోయింది. లేకుంటే తలకి పెద్ద గాయమే అయ్యేది. ఎవరా వ్యక్తి. రోడ్డు మధ్యలో పిచ్చి వేషాలు వేస్తున్నాడా. మెహం సరిగ్గా కనబడట్లేదు.తలకి టోపీ.. ఆ షర్ట్ ఏంటి.. ఎక్కడో చూసినట్టుందే. నాలుగు తగిలిధ్ధాం అని కార్ ఆపేసి డోర్ తీసేలోపే... డ్డామ్ మ్ మ్ .. చెవులు పగిలిపోయే శబ్దం. చుట్టు పొగ.. రోడ్డు మీద  ఎదురుగా మంటలు. అస్సలు ఏం జరిగింది. ఏం కనబడట్లేదు. డోర్ తీయకుండా మంచి పని చేసాను. పొగ ఇంకా కార్ లోపలకి రాలేదు. అమ్మ. అమ్మకి ఎం జరగలేదు కదా. "అమ్మా.. ఏమన్నా తగిలిందా". "లేదురా... అస్సలు ఏం జరిగింది, నీకు ఏమి కాలేదు గా". "లేదు లే" ఎందుకైనా మంచిది అని పొగలోనే మెల్లిగా కారు దిగి, ఇంకోవైపు డోర్ తీసి అమ్మని రోడ్డు పక్కకి తీస్కొచాను. ఎక్కడ్నుంచి వచ్చారు ఇంతమంది జనం. దూరం గా ఫైర్ ఇంజిన్ వస్తున్న శబ్దం. ఎవరో  నీళ్ల బాటిల్ తెచ్చిచారు. బాటిల్ అమ్మకిచ్చి, ఏమైందని అడిగాను, పక్కనున్న పెద్దాయన్ని. "పెద్ద ఆక్సిడెంట్. స్కూల్ బస్సు, పెట్రోల్ లారీ గుధ్ధుకున్నాయ్. అదృష్టంకొద్దీ పిల్లలెవరూ స్కూల్ బస్సు లో లేరు. అందర్నీ దించేసి వస్తున్నట్టున్నాడు డ్రైవర్. పాపం. ఇద్దరు డ్రైవర్లు స్పాట్ డెడ్". కారు కి అడ్డం గా వచ్చింది ఎవరో.. నాకు మాత్రం దేవుడిలా అనిపించాడు. ఆ వ్యక్తి కనిపిస్తాడేమో అని చుట్టుపక్కల చూసా.. ఎక్కడా కనిపించలేదు. ఏమిచ్చి అతని రుణం తీర్చుకోవాలి. అతడేగాని అడ్డురాకపోయుంటే ఏం జరుగుండేదో తలచుకోవడానికే భయంగా ఉంది. స్కూల్ బస్సు , పెట్రోల్ లారీ మద్యలో నా కారు గుజ్జు గుజ్జు అయిపోయేది. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పేశాక కార్ వేస్కోని ఇంటికి వచ్చాము. అమ్మ ఏం మాట్లాడట్లేదు. నా చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి.
ఫ్రెష్ అయ్యేలోపు అమ్మ కాఫీ తెచ్చింది. తీస్కోని బాల్కని లోకి వెళ్దామని బాల్కనీ కీస్ తీసుకొని అటువైపు కదిలాను. బాల్కనీ డోర్ తెరిచే ఉంది. "మా... బాల్కనీ డోర్ తీసింది నువ్వేనా..?". "లేదురా...అటు వైపు రానే లేదు" చెప్పింది అమ్మ. మరి ఎలా. పొద్దున వెళ్తూ ఈ డోర్ మూయడం నాకు బాగా గుర్తు. వెళ్లేముందు చెక్ చేసి మరీ వెళ్ళాను. చెక్ చేద్దాం అని బాల్కనీ లోకి వచ్చాను. బాల్కనీ గోడమీద పూలకుండి కనబడటట్లేదు. పొరపాటున కింద పడిపోయిందేమో అని చూస్తే, నేలమీద ముక్కలైపోయిన పూలకుండి. ఎవరో వచ్చారు. ఎవరు వచ్చుంటారు? అసలెలా వచ్చారు. లోపలికి మెయిన్ డోర్ ద్వారా ఎవరూ రాలేరు. ఉన్నవి రెండు కీస్. అమ్మ దగ్గర ఒకటి, నా దగ్గర ఒకటి. కీస్ వేసే ఉన్నాయి. ఇంట్లో ఏమి పోలేదు కదా. నేనే డోర్ లాక్ చేయడం మర్చిపోయానా. ఛాన్స్ ఏ లేదు. నిన్న ఆ కాల్. ఆ వ్యక్తి చెప్పినట్టు గా ఈరోజు ఈ సంఘటన. ఇంట్లోకి ఎవరో రావడం. బుర్ర పిచ్చచెక్కుతోంది.

ఇల్లు మొత్తం చెక్ చేశాను. thank god. ఏమి పోలేదు. అస్సలు ఈ watchman ఎక్కడ పోయాడు. watchman కి కాల్ చేశా. లిఫ్ట్ చేయలేదు. ఈ watchman యే డోర్ unlock చేసుంటాడా .. లేదు. అతనలాంటి వాడు కాదు. దాదాపు 4 సంవత్సరాలు గా మాతోనే ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు. అమ్మ ఇంకా ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు ఉంది. జరిగింది మాములు విషయం కాదు. 

"అమ్మ.. ఇప్పుడు ఏం అవ్వలేదు కదా.. అలా దిగులుగా ఉండకు."
" ఏమో రా..ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. నాకు ఏమైనా పరవాలేదు. నీకు ఏమన్నా అయ్యుంటే. నా గుండె ఇంకో గాయాన్ని తట్టుకోలేదు చిన్నా. ఆ దేవుడే మనల్ని కాపాడాడు."
" సరే నువ్ ఊర్కో అమ్మ.. ఏడవకు. నువ్ వెళ్లి కాస్త ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీస్కో.. ఈరోజు నేను వంట చేస్తా.." 

N.E.X.T P.A.R.T tomorrow @ 6PM


Comments