T.H.E | Ep:4
--- గురువారం 14/Sep/2017 ---
గురువారం సాయంత్రం ఆరు. "ఓం సాయి... శ్రీ సాయి.. జయ జయ సాయి.." అని మా డోర్ బెల్ మోగింది. సాయిబాబా భజన పాటలు వచ్చే డోర్ బెల్. అమ్మ ఒకసారి సూపర్ మార్కెట్ లో చూసి, తనకి బాగా నచ్చి కొనుక్కొచ్చింది. బుర్ర లో కుమార్ చెప్పిన విషయాలు గుర్తొస్తూనే ఉన్నాయ్. తను ఎం చేయమంటాడో అన్న టెన్షన్. ఇంకా ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో అన్న భయం. ఇవన్ని మనసులో పెట్టుకొని వర్క్ చేయలేక త్వరగా ఇంటికి వచ్చేసాను. అమ్మ ఆటో లో వస్తా అని చెప్పింది. నా రూమ్ లో కూర్చొని, ఆ అజ్ఞాత వ్యక్తి నన్ను ఏం చేయమని అడుగుతాడ అని ఆలోచిస్తున్నా..అప్పుడు వచ్చింది నా బుర్ర కి ఓ ఐడియా. ల్యాండ్ లైన్ కి కాల్ చేసిన నెంబర్ ని ట్రాక్ చేస్తే ఎమన్నా తెలుస్తుంది కదా. మా ల్యాండ్ లైన్ ఫోన్ కి డిస్ప్లే పనిచేయకపోవడం వల్ల అందులో నెంబర్ చూడచ్చు అనే ఐడియా నాకు అప్పుడు రాలేదేమో. ఇక ఆ నెంబర్ చూడాలంటే తరువాతి నెల లో వచ్చే బిల్ కోసం వెయిట్ చేయాలి.వెంటనే BSNL లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేసే నా ఫ్రెండ్ సుకన్య కి ఫోన్ చేశాను.
"హాయ్ సుకన్య.. ఎలా ఉన్నావ్..."
"ఏంటి సర్..ఎలా ఉన్నారు. నేను బాగానే ఉన్నా..."
"పర్లేదు..నాకో చిన్న హెల్ప్ కావాలి."
"చెప్పు..ఏదైనా ప్రాబ్లమా?"
"అలా ఏం లేదు. మా ల్యాండ్ లైన్ డిస్ప్లే పోయింది. నిన్న ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. ఆ నెంబర్ కావాలి."
"హహ..నేనేమైన కస్టమర్ కేర్ లో ఉన్నా అనుకున్నావా..మాకు ఆ డీటెయిల్స్ చూడడం కష్టం కృష్ణ..."
"కస్టమర్ కేర్ కి ఫోన్ చేయచ్చు.. బట్ వాళ్ళు టైం తీస్కుంటారు...చాలా ఇంపార్టెంట్ ఇది."
"సరే..నేను చూస్తాను...ఒక 30 మినిట్స్ నాకు టైం ఇవ్వు. అన్నట్లు ఏ టైం లో కాల్ వచ్చింది.."
"నిన్న మా ల్యాండ్ లైన్ కి వచ్చిన ఒకే ఒక కాల్ అదే...రాత్రి 9.30 టైం లో వచ్చింది. మా ల్యాండ్ లైన్ నెంబర్ నీకు whatsapp లో పంపాను."
"సరే నేను చూసి నీకు ఫోన్ చేస్తా.."
"చాలా థాంక్స్ సుకన్య..."
"మనకు థాంక్స్ ఏంటి బాస్..పర్లేదు."
కొంచెం క్లూ దొరకబోతున్నందుకు సంతోషం గా ఉన్నా, ఎవరై ఉంటారో అన్న టెన్షన్ కూడా ఉంది. సరే చూద్దాం ఏమవుతుందో. అయిన కుమార్ ఈరోజు ఫోన్ చేస్తాడు అని చెప్పాడు గా ఇంకా చేయలేదు ఏంటి అని అనుకుంటుండగా ల్యాండ్ లైన్ రింగ్ అయ్యింది.
వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేశాను. " ఏంటి నా గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసావా. నువ్ చేస్తావ్ అని నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా అలానే చేశాను. అయిన నీకు నమ్మకం కలగడానికి నీకు మాత్రమే తెల్సిన నీ ATM పిన్ నెంబర్ చెప్పమంటావా. అంతెందుకు, మొన్న మంగళవారం నువ్వు అమ్మ తో కృతిక గురించి చెప్పాలని అనుకున్నావ్. కానీ ఆక్సిడెంట్ తరువాత ఎందుకు లే, తర్వాత చెప్దాం అని మానుకునున్నావ్. ఈ విషయం నీకు మాత్రమె తెలుసు. ఇలాంటి విషయాలు నేను నీకు చెప్తే, నువ్ చెప్పింది వినకుండా నేను ఎవరు అనేదాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతావ్. ఈ పని చేయాలంటే నా మీద నీకు పూర్తి గా నమ్మకం అవసరం. నీకు ఇప్పుడు నా మీద.. అదే నీ మీద.. పూర్తిగా నమ్మకం వస్తే, నీ బెడ్ రూమ్ టేబుల్ డ్రా లో ఒక ప్రింటౌట్ ఉంటుంది. ఫోన్ పెట్టేసాక వెళ్లి చూడు. ఏం చేయాలో కూడా దాని వెనుక వైపే రాసుంటుంది." అని చెప్పాడు. నేనేం చెప్పాలో తెలియక "సరే" అని చెప్పాను. "అందులో చెప్పింది చెప్పినట్టు గా చెయ్..లేకపోతే...నేను చెప్పలేను. అమ్మ కోసం నువ్వు ఈ పని చేయాలి..." అని చెప్పాడు. "కుమార్...నువ్వు ఎవరో నాకు తెలియదు. నువ్వూ మాకు సహాయం చేస్తున్నావో లేక blakmail చేస్తున్నావో తెలియదు. కాని ఈ విషయం గుర్తు పెట్టుకో. అమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేశాను.
వెంటనే వెళ్లి టేబుల్ డ్రా ఓపెన్ చేశా. ఎదో లొకేషన్ కి గూగుల్ మ్యాప్ ప్రింట్ ఉంది అందులో. సిటీ నుంచి దాదాపు గా 110KM దూరం ఉన్న లొకేషన్ ని టార్గెట్ గా చూపిస్తోంది మ్యాప్ లో. ఆ లొకేషన్ పేరు కూడా లేదు అందులో. సిటీ కి అటువైపు గా వెళ్తే అంతా అడవి ఉంటుంది.. కానీ అడవి లోపల 110 కిలోమీటర్లు అంటే అక్కడ ఏముండచ్చు. మ్యాప్ కి బ్యాక్ సైడ్, ఆ లొకేషన్ కి ఎప్పుడు బయల్దేరాలి, అక్కడికి వెళ్ళాక ఏమి చేయాలో రాసుంది. ఇందులో రాసున్నదాని ప్రకారం రేపు సాయంత్రం 6 కి ఇక్కడనుంచి నేను భయల్దేరాలి.
మ్యాప్ కి వెనుక వైపు రాసున్న హ్యాండ్ రైటింగ్ మాత్రం అచ్చు న హ్యాండ్ రైటింగ్ లాగా ఉంది. అంటే ఇది నేనే రాశానా? అస్సలు అర్థం కావట్లేదు. ఈ గొడవ లో పడి కృతిక విషయమే మర్చిపోయాను. ఈ ఆక్సిడెంట్ జరగకపోయుంటే మా ప్రేమ గురుంచి అమ్మ కి చెప్పేవాడిని. మొదట ఈ ఇష్యూ అయిపోతే, తరువాత అమ్మ తో మాట్లాడదాం. కృతిక కి ఫోన్ చేసే ఆక్సిడెంట్ గురించి చెప్పా..ఈ లెటర్, ఇంకా ఆ అజ్ఞాతవ్యక్తి గురించి తనకు చెప్పలేదు. ఎందుకు తనని అనవసరం గా ఇందులోకి లాగడం. తనతో మాట్లాడ్తుంటే సుకన్య కాల్ వచ్చింది. కృతిక కి తరువాత కాల్ చేస్తా అని చెప్పి పెట్టేశాను.
వెంటనే సుకన్య కి కాల్ చేశాను.
" హాయ్ కృష్ణ...ఈ టైం లో తంటాలు పడి నీ కోసం నెంబర్ సాధించాను... whatsapp లో ఆ నెంబర్ పంపుతున్నా.."
"చాలా థాంక్స్ సుకన్య..."
"పర్లేదు..మీ ల్యాండ్ లైన్ కి నిన్న వచ్చిన కాల్స్ లో కేవలం ఈ ఒక్క నెంబర్ మాత్రమే ఉంది. అంతకు ముందు రోజు కూడా ఈ నెంబర్ నుంచి మీ ల్యాండ్ లైన్ కి కాల్ వచ్చింది."
"హా అవును.. కరెక్టే. "
"సరే.. ఇంకా దీని గురించి ఏదైనా కావాలంటే ఫోన్ చెయ్...సరేనా.."
"ok.. bye!"
ఫోన్ పెట్టేయగానే whatsapp మెసేజ్ టోన్ వచ్చింది. ఓపెన్ చేసి చుస్తే షాకింగ్!!!! అది నా మొబైల్ నెంబర్!!!
F.I.N.A.L P.A.R.T tomorrow @ 6PM
Comments